Gurukula School | ఇక్కడ ఉండం సార్!

Gurukula School | ఇక్కడ ఉండం సార్!
- లగేజీలతో గురుకుల విద్యార్థుల ఆందోళన
Asifabad | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఇక్కడ ఉండం సార్.. అంటూ కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) సిర్పూర్(టి) గురుకుల ఆశ్రమ పాఠశాల(Gurukula Ashram School) విద్యార్థులు లగేజీ సర్దుకుని గేటు బయట ఆందోళన చేశారు. సిర్పూర్ లో భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి 9, 10వ తరగతి చదువుతున్న 140 మంది విద్యార్థుల(140 students)ను ఆగస్టు 13న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) గురుకులంలో తాత్కాలికంగా చేర్చారు.
సిర్పూర్ గురుకులానికి చెందిన ఇతర విద్యార్థులను ఆసిఫాబాద్, జైపూర్, కోరుట్ల పాఠశాలల్లో చేర్చారు. బెల్లంపల్లి సీఓఈలో సుమారు మూడు నెలల నుంచి ఇక్కడ ఉంటున్న సిర్పూర్ విద్యార్థులు(Sirpur students), తమకు కనీస సౌకర్యాలు లేవని, ఇక్కడి సిబ్బంది తమ పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఈ రోజు ఉదయం ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది విద్యార్థులకు కేవలం రెండే టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, తమను చిన్నచూపు చూస్తున్నారని వారు వాపోయారు.
సిర్పూర్ పాఠశాల భవనం బాగు చేయించి, కొత్త భవనం(new building) నిర్మించి, తమను తిరిగి సొంత పాఠశాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ 9వ తరగతికి చెందిన 55 మంది విద్యార్థులు తమ బ్యాగులు, లగేజీలతో సహా పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై గంటపాటు బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఓఈ ప్రిన్సిపాల్ విజయసాగర్(COE Principal Vijayasagar), సిర్పూర్(టి) పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుమన్ లు విద్యార్థులకు నచ్చజెప్పారు. సిర్పూర్ విద్యార్థులను తాము గానీ, సిబ్బంది గానీ ఎవరినీ చిన్నచూపు చూడలేదని, అందరినీ సమానంగా చూస్తున్నామని, ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. అధికారుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
