రాత్రి బస్సులపై స్పెషల్ ఫోకస్

- జిల్లాలో బస్సులపై ముమ్మర తనిఖీలు
- భద్రతా ప్రమాణాలపై ఎస్పీ హెచ్చరిక
కర్నూలు, (ఆంధ్రప్రభ): ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసీ బస్సులపై ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ముఖ్యంగా రాత్రి పూట తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
తనిఖీల్లో భాగంగా బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు వంటి అంశాలను పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను పాటించని వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
ప్రజల ప్రాణభద్రత కోసం పోలీసులు “ఫ్రెష్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జరిగే ఈ కార్యక్రమంలో, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై జాతీయ రహదారుల (ఎన్‌హెచ్–40, ఎన్‌హెచ్–44) పరిధిలో ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ వాహనాలను పోలీసులు ఆపి డ్రైవర్లను నీళ్లతో ముఖం కడగమని సూచిస్తున్నారు.

ఈ చర్య ద్వారా డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారకుండా, పూర్తి జాగ్రత్తతో వాహనం నడపాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. ప్రాణం విలువైనది… ఒక క్షణం నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుంది. డ్రైవర్లు తమ కుటుంబాలను గుర్తు చేసుకుని జాగ్రత్తగా నడవాలి అని విక్రాంత్ పాటిల్ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా హైవే మార్గాల్లో పోలీసులు రోడ్డు భద్రతా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, డ్రైవర్ల కౌన్సెలింగ్ వంటి చర్యలను చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ పేర్కొన్నారు.
