మాజీ ఎమ్మెల్యే కైలే పై కేసు

మాజీ ఎమ్మెల్యే కైలే పై కేసు

హైవేపై ఓవర్ యాక్షన్ .. పోలీసు అధికారులపై దురుసుతనం ప్రవర్తన


( ఆంధ్రప్రభ, మచిలీపట్పం ప్రతినిధి) : హైవే పైన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగే రీతిలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ (Kyle Anil Kumar) సమీకరించిన జనసమూహాన్ని, హైవే పైన ట్రాఫిక్ రద్దీతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా విధులు నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి విధులకు ఆటంకం కలగించినందుకు గాను కైలే అనిల్ పై చట్ట ప్రకారంగా కేసు నమోదు చేసినట్టు కృష్ణాజిల్లా పోలీసులు ప్రకటించారు.

నేషనల్ హైవే పైన (On National Highway) ట్రాఫిక్ రద్దీతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగే రీతిలో జన సమీకరణాన్ని నిషేధిస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజల ప్రాణాలకు అపాయం కలగకుండా ఆంక్షలు పొందుపరుస్తూ కైలే అనిల్ కుమార్ కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసు ఇచ్చారు. పోలీసుల నోటీసుకు కైలే అనిల్ acknowledgement కూడా ఇచ్చారు.

అయినప్పటికీ, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పర్యటన సందర్భంగా మంగళవారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఆయన అనుచరులు సుమారు 1000 మంది గోపువానిపాలెం క్రాస్ రోడ్డు వద్ద జనాలను పోగుచేసి హైవేకి అడ్డంగా నిలబడి, ట్రాఫిక్ కు అంతరాయము కలిగేటట్లు, అక్కడ ఉన్న ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉండే విధంగా ఉన్నట్లు సీఐ చిట్టిబాబు గమనించారు. ఆయన తన వద్ద ఉన్న పోలీస్ సిబ్బంది తో అక్కడికి వచ్చి, అక్కడున్న జనం ప్రాణాలు , హైవే మీద వెళ్తున్న జనం ఇబ్బంది కలగకుండా హైవే మీదకు వచ్చే జనాన్ని అదుపు చేస్తూ ఉండగా, అదే సమయంలో కైలే అనిల్ కుమార్ అక్కడికి వచ్చి ఇక్కడ జనాలకి ఏమైనా పరిమితి ఉందా? మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు, మీరెంత మేము తలచుకుంటే, మీసంగతి చూస్తా అని గట్టిగా అరుస్తూ పోలీస్ లు డౌన్ డౌన్ పమిడిముక్కల సీఐ డౌన్ డౌన్ అని స్లోగన్ లు ఇచ్చి వాగ్వాదం చేశారు.

ప్రజల ప్రాణాలను కాపాడడానికి విధులు నిర్వహిస్తున్న పోలీసులు కించపరిచేలా ప్రవర్తిస్తూ, విధులను ఆటంకంకలిగించే విధంగా పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసిన చర్యను కృష్ణా జిల్లా పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన లేదా మరే విధమైన కార్యక్రమమయినా ఎటువంటి ఆంక్షలు, నియంత్రణలు లేకుండా జరగడం సాధ్యం కాదు. ఆ విధంగా సమాజంలో అటువంటి కార్యక్రమం చేసే కొందరి వ్యక్తుల కోసం మిగిలిన వారందరినీ వారి దైనందన జీవితాన్ని ఇబ్బంది కలిగించకుండా ఉండే ఉద్దేశ్యంతో ఆ కార్యక్రమం సాఫీగాసాగడం కోసం పోలీసులు కొన్ని ఆంక్షలు సమా జహితం కోసం జారీ చేయడం అనివార్యం అవుతుంది. ఈ కొద్ది ఆంక్షలు లేకపోతే, సదరు కార్యక్రమంలో ఉన్న వారి ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం లేక పోలేదు. అయితే విధి నిర్వహణ లో భాగంగా నిద్రాహారాలు మాని, మందుటెండలో మంచి నీళ్ళు కూడా సరిగా తాగకుండా విధులు నిర్వహించే పోలీసు శాఖ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించే ముందు విజ్ఞతతో వ్యవహారించాలి , అని కృష్ణాజిల్లా పోలీసు శాఖ వ్యాఖ్యానించింది. ఈ విధమైన ఘటనలు పునరావృతం కాకుండా ఈ కేసులో సేకరించిన ఆధారాలు, డ్రోన్ పుటేజీ ని అనుసరించి త్వరలో మిగిలిన నిందితులను కూడా గుర్తించి చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ రాజా స్పష్టం చేశారు.

Leave a Reply