వణికిస్తున్న డెంగ్యూ కేసులు

వణికిస్తున్న డెంగ్యూ కేసులు
అక్కడ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్న ప్రజలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గత పది రోజులుగా జిల్లాలో పడిన అత్యధిక వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో డెంగ్యూ జ్యరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 102 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక మలేరియా కేసు కూడా నమోదయింది. గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు. జ్వరాల పీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు డాక్టర్లు ప్రజలను దోచుకుంటున్నారు. చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖ డివిజన్ల ప్రకారం చిత్తూరు డివిజన్లో 55 కేసులు, నగరి డివిజన్లో 27 కేసులు, పలమనేరు డివిజన్లో 19 కేసులు, కుప్పం డివిజన్లో ఒక డెంగ్యూ కేసు నమోదు అయింది. అలాగే చిత్తూరు డివిజన్లో ఒక మలేరియా కేసు కూడా నమోదయింది. దీంతో ఎక్కడ చూసినా ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం అంటూ అవస్థలు పడుతున్నారు.
దాదాపు నెలరోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ వందల మంది చికిత్స కోసం వస్తున్నారు. అధికారిక లెక్కల మేరకు సరాసరిగా రోజు 1500 మంది అన్ని విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 60 శాతం జ్వర బాధితులే ఉంటున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రి జ్వర బాధితులతో కిటకిటలాడుతోంది. ఉదయం ఓపీ ప్రారంభం నుంచి మధ్యాహ్నం ముగిసే వరకు జ్వర బాధితులు క్యూకడుతున్నారు. జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న పలువురు బాధితులను డాక్టర్లు అడ్మిషన్ చేసుకుంటున్నారు. చిన్నపిల్లల విభాగంలో ప్రతి రోజు 30 నుంచి 40 మంది అడ్మిట్ అవుతున్నారని ఇందులో 8 నుంచి 10 మంది వరకు జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారిలో నిమోనియా లక్షణాలు ఉంటున్నాయని చిన్నపిల్లల వైద్యు లు చెబుతున్నారు.
పెద్దల ఓపీ విభాగంలోనూ పురుష, మహిళా విభాగాలకు 300 నుంచి 400 మంది వరకు జ్వరం, దగ్గు, జలుబు బాధితులే వస్తున్నారని ఆ విభాగాల వైద్యులు అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలను వైరల్ జ్వరాలు దగ్గు, జలుబుతో బాధితుల గొంతు కూడా మారుతోంది. భారీ వర్షాలతో ఇంటి చుట్టుపక్కల తాగి పడేసిన కొబ్బరి బొండాలు, వాడని పాత్రలు, గుంతలలో నీరు నిలిచి ఉండటం వల్ల డెంగ్యూ దోమలు ఎక్కుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డెంగ్యూ దోమలు నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడంతో అవి అభివృద్ధి చెంది ఈ పరిస్థితి ఏర్పడుతోంది. వైద్య, ఎంటోమాలజీ పరిశోధనలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నట్టు వర్షాల తర్వాత డెంగ్యూ కేసులు పెరగటం సాధారణం.
చెత్త, పాడైన టైర్ల్లా, గాజులు, బాటిళ్లు వంటి వస్తువుల్లో నీరు నిలిచినప్పుడు అవి దోమలకు బ్రీడింగ్ స్థానాలుగా మారతాయి. స్థానిక పారిశుద్ధ్య లోపాలు కూడా కారణం. ప్రతి రోజు లేదా కనీసం వారంలో ఒకసారి ఇంటి చుట్టూ ఉన్న నీరు నిలిచే పాత్రలను శుభ్రం చేయాలి. ట్యాంకులు, పాత్రలలో నిలిచే నీటిని పారపోయాలి. ప్రజలు దోమ తేరలు వాడాలి. పంచాయతీలు, మునిసిపాలిటీలు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఫాగింగ్ డ్రైవ్ చేపట్టాలి. కట్టడాల, నిర్మాణ స్థలాల దగ్గర అవసరమైన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రుల నుండి కేసుల రిపోర్టులను తెప్పించుకొని, ఆ ప్రాంతాల మీద దృష్టిని కేంద్రీక రించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలి. హాట్‌స్పాట్ లను మ్యాపింగ్ చేసి వాటి నివారణకు కృషి చేయాలి.
డెంగ్యూ నివారణకు కృషి
జిల్లాలో 102 డెంగ్యూ కేసులు, ఒక మలేరియా కేసు నమోదు అయిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వేణుగోపాల్ ఆంధ్రప్రభకు తెలిపారు. దీంతో అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలోని వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గత సంవత్సరం 300 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వివరించారు. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నామని, మున్సిపాలిటీ, గ్రామస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారని అన్నారు. అవసరమైన మందులను కూడా అందజేస్తున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను, మెడికల్ క్యాంపులను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరారు. ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడడం చాలా మంచిదని సూచించారు. ఇళ్లలో జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాల్సిందిగా కోరారు.
