కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం
హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : బిసి లకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శనివారం బిసి బంద్ లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము బంద్ లో పాల్గొంటున్నామని, ఇచ్చిన హామీ అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ, చట్టబద్దత కల్పించాల్సిన బి జె పి పార్టీ ల నాయకులు సిగ్గు లేకుండా రోడ్ల పైకి వచ్చారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ లో బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని, దానిని గవర్నర్ కు పంపారని, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా నే ఆర్డినెన్స్, ఆ తర్వాత GO లను తీసుకొచ్చిందని విమర్శించారు. బిసి లను మోసం చేయడానికి అనేక డ్రామాలు ఆడుతున్నారని, మా ఆత్మ గౌరవం కోసం మేము పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

తమ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత ఉదృతం అవుతుందని స్పష్టం చేశారు. 22 నెలల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాలో మీ అగ్రనాయకత్వం ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్దత లభిస్తుందని తెలియదా? అని ప్రశ్నించారు. బిసి లకు 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తామని వివరించారు.

