కమ్యూనిస్టుల అరెస్టు
కమ్యూనిస్టుల అరెస్టు
( కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం సీపీఐ. సీపీఎం నేతలు ఎం.రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. రాజకీయంగా ప్రశాంత వాతావరణం నెలకొనాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినప్పటికీ, కమ్యూనిస్టు నేతలు మాత్రం ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.
ప్రధాని వస్తే.. ప్రజా హక్కులకు తాళం వేస్తున్నారా?
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు చర్యగా సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఎన్నుకున్న ప్రధానమంత్రి వస్తున్నాడనే కారణంతో ప్రజా ఉద్యమాల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటన పేరుతో వందల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం, ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు భయపడటం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రజా ప్రయోజనాల కోసం పోరాడతారు తప్ప ప్రజాధనాన్ని దోచుకోరు. కేరళ ప్రభుత్వం దీనికి ఉదాహరణ అని గుర్తు చేశారు.
నాలుగు సార్లు వచ్చి మోదీ ఏం ఇచ్చారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఈ 16 నెలల కాలంలో నాలుగోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పటికీ, ఆయన ఏపీకి చేసిన మేలు ఏమిటి అని కమ్యూనిస్టులు ప్రశ్నించారు. కమ్యూనిస్టులు త్యాగాలతో సాధించిన ఆస్తి విశాఖ ఉక్కు . దానిని ప్రైవేటీకరించిన మోదీని సిగ్గు లేకుండా రాష్ట్రానికి రప్పించడం, సభలు నిర్వహించడం దౌర్భాగ్యం అని సిపిఎం నాయకులు విమర్శించారు.
జీఎస్టీతో ఏటా రూ. 8500 కోట్లు నష్టం
జీఎస్టీ వల్ల ఏపీకి సంవత్సరానికి రూ.8,500 కోట్ల నష్టం వస్తోందని పేర్కొంటూ, ఇంత నష్టం జరుగుతుంటే కూడా చంద్రబాబు నాయుడు మోదీ మాటలను ఎలా నమ్ముతాడు?” అని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారమూ, విద్యుత్ చార్జీలు పెరుగుదలతో మోదీ పాలన ప్రజలకు కష్టాలు తెచ్చిందని పేర్కొన్నారు.
-మోదీ అప్పులు చేశాడు .. పరిశ్రమలు లేవు.
స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసి పరిశ్రమలు నెలకొల్పిందని, కానీ మోదీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని ఆరోపించారు. విదేశీ పర్యటనలు, ఖరీదైన దుస్తులు మాత్రమే మోదీకి ప్రాధాన్యం. ప్రజల జీవితం మాత్రం కష్టాలతో నిండిపోయింది” అని విమర్శించారు.అదానీ–అంబానీలకు లాభాలు… ప్రజలకు నష్టమే .మోదీ పాలనలో ఆదానీ, అంబానీల ఆస్తులు మాత్రమే పెరిగాయి. కానీ సామాన్య ప్రజల స్థితి మరింత దయనీయమైంది” అని నేతలు మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలు నిశ్శబ్దంగా ఉండి ప్రజలకు అన్యాయం చేశారు” అని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా, హామీలపై మోసం
విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర–రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖ రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీని ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని కమ్యూనిస్టు నేతలు తెలిపారు. చంద్రబాబు కూడా రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని చెప్పి మాట తప్పాడు. ఈ ఇద్దరినీ ప్రజలు క్షమించరని” వారు స్పష్టం చేశారు.ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వ్యవహారం. ప్రజల కోసం రోడ్లమీదకు వచ్చి పోరాడే కమ్యూనిస్టులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే” అని సిపిఎం, సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని రాకంటే ప్రజా హక్కులే పెద్దవి. ప్రజల స్వరం ఎప్పటికీ మోనవ్వదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాని రాకతో మోడీ మేనియా పెరిగింది. కానీ ఎరుపు శక్తుల గళం అణగదనే సంకేతాలు!ప్రజా స్వామ్యం కాపాడాలంటే అణచివేతలపై పోరాటమే మార్గం అంటున్న కమ్యూనిస్టులు.
Arrest of communists
