ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు

  • రాత్రికి రాత్రే మారిన బోర్డు
  • వివాదాల్లో బోర్డు వృద్ధాశ్రమం
  • ఆంధ్రప్రభ కథనాలతో కదిలిన డొంక
  • సబ్ కలెక్టర్ భావన ఆధ్వర్యంలో విచారణ

రాజంపేట, ఆంధ్రప్రభ : సేవా సంస్థలు అంటే అందరికీ గౌరవం. రాజ్యాంగమే సేవకు మంచి స్థానాన్ని కల్పించింది. అలాంటి సేవ పక్కదారి పడితే మొత్తం స్వాహా పర్వమే. లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు.. అనే రీతిలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం రాయచోటి రోడ్డు లోని ఒక వృద్ధాశ్రమం సోషల్ మీడియాలో చేసుకున్న ప్రచారం ఆ సంస్థ మెడకు చుట్టుకుంది.

అక్కడ వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంచి మంచి ఫోటోలతో వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లలో బహుళంగా ప్రచారం చేశారు. అక్కడ వృద్ధులు ఉండడానికి అనువైన ప్రాంతమని ఆ వీడియోలు ఫోటోలు చూసినవారు ఎవరైనా భావిస్తారు. కానీ సోషల్ మీడియా ప్రచారానికి వాస్తవానికి పరస్పర విరుద్ధంగా కనిపించడంతో ఆ వృద్ధాశ్రమం వార్తల్లోకి ఎక్కింది.

ఆ సంస్థ నిర్వాహకులు వారు చేసిన ప్రచారంలో చూపించిన చిత్రాలు అక్కడికెళ్లి పరిశీలిస్తే కనపడే దృశ్యాలు భిన్న వైరుధ్యంగా ఉండడంతో దానిని ఆంధ్రప్రభ రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురిస్తోంది. దీనిపై శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ భావన స్పందించారు.

రాజంపేట తహసిల్దార్ పీర్ మున్ని ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ భావన స్వయంగా ఆ వృద్ధాశ్రమం దగ్గరికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని విచారించారు. వారు చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి విరుద్ధంగా ఉందని గ్రహించారు. దీనిపై వెంటనే సమగ్ర నివేదికను సమర్పించాలని సబ్ కలెక్టర్ భావన తహసిల్దార్ పీర్ మున్నికి అప్పజెప్పారు.

రాత్రికి రాత్రే మారిన బోర్డు…

గురువారం ప్రచురితమైన కథనంతో రాజంపేట రాయచోటి రోడ్డులో రాజంపేట మండలంలోని వివాదాల్లో ఇరుక్కుపోయిన ఆ వృద్ధాశ్రమం బోర్డు రాత్రికి రాత్రి మారిపోయింది. ఆ వృద్ధాశ్రమంలో గదుల్లో వృద్ధుల బదులు జంతువుల కళేబరాలు ఉన్నాయని చిత్రాలతో సహా ఆంధ్రప్రభ కథనం ప్రచురితమైంది.

అక్కడ వృద్ధుల నివాసానికి బదులు అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆంధ్రప్రభ ప్రచురించింది. అంతేకాదు ఆ వృద్ధాశ్రమంలో బస చేస్తున్న రాయచోటి పట్టణానికి చెందిన ఒక ముస్లిం వృద్ధుడు అక్కడ మృతిచెందగా ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా ఆ మృతదేహాన్ని ఎవరికి అప్పజెప్పారుయ? అన్న విషయం క్లారిటీ లేదు.

సాధారణంగా వృద్ధాశ్రమాల కార్యకలాపాలు మండల అధికారులకు తెలిసి ఉండాలి. కానీ రాజంపేట మండల అధికారులకు ఆ వృద్ధాశ్రమం వివరాలు తెలియదని చెబుతుండడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. వృద్ధాశ్రమం పేరుతో కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడానికి వేసిన పన్నాగమే ఇది అని పలువురు విమర్శిస్తున్నారు.

గతంలో ఉన్న అధికారులను కాకా పట్టిన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వృద్ధాశ్రమం ముసుగులో సేవలు బదులు కబ్జా పర్వాలు సాగిస్తున్నారు అన్న దిశగా విచారణ సాగనుంది. సబ్ కలెక్టర్ భావన ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిగితే చట్ట విరుద్ధంగా నడుస్తున్న ఆ సంస్థ గుట్టు రట్టు చేయవచ్చని పలువురు అంటున్నారు.

Leave a Reply