ఈరోజు అవతారం మహిషాసుర మర్థిని

అయిగిరి నందిని నందితమోహిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్యశిరో2ధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసురమర్థిని రమ్యకపర్ధిని శైలనుతే!!

ఇలా రాగయుక్తంగా సాగే మహామహిమోపేతమైన మహిషాసుర మర్ధిని స్తోత్రమును భక్తి శ్రద్ధలతో దుర్గానవరాత్రులలో నవమి రోజన మహిషాసుర మర్థిని రూపంలో యున్న అమ్మ అనుగ్రహం కోసం భక్తులు పఠిస్తారు. మానవులలో యున్న జడత్వ భావనలు, వ్యతిరేక భావనలు తొలగిపోయి స్వచ్ఛమైన భావనలు పాదుకుంటాయి. మహిషము ధిక్కారమునకు ప్రతీక. మహిషుడు గర్వమునకు, మదమునకు అంధకారమునకు ప్రతీక. మహిషాసురుని వధ గురించి దుర్గా సప్తశతిలో రెండు, మూడు మరియు నాల్గవ అధ్యాయములలో విపులముగా వివరించబడినది.

ఉద్యద్భాను సహస్రకాంతి మరుణ క్షౌమాం శిరోమాలికాం
రక్తాలిప్త పయోధరాం జపపటీం విద్యామభీతిం వరం
హస్తాబ్జైర్దధతీం త్రినేత్రవిలసత్‌ వక్త్రా రవింరశ్రియం
దేవీంబద్దహిమాంశు ఖండముకుటాం వందే2 రవింద స్థితామ్‌ !!

మహిషాసురుడు అనే రాక్షసుని చేతిలో త్రిమూర్తులతో సహా దేవతలందరా పరాజితులౌతారు. అప్పుడు దేవతలందరూ తమతమ శక్తులను ధారపోసి పార్వతీదేవిని యుద్ధానికి పంపుతారు. అప్పుడు ఆ తల్లి మహిషాసుర సంహారము గావిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మాన్ని గెలిపించే అత్యంత ఉగ్రమైన రూపం మహిషాసురమర్ధిని అవతారము. తొమ్మిదవ రోజైన నవమిని మహార్నవమి అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది కనుక సిద్ధిదా అనికూడా పిలుస్తారు.
ఈ రోజు దుర్గాసప్తశతి పారాయణ, ఖడ్గమాలా స్తోత్ర పారాయణ అత్యంత ఫలదాయకము. ఈ రోజు అమ్మవారికి పానకం, వడపప్పు, గారెలు, పురిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఎరుప రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించాలి.

ఈ రోజు అమ్మవారు శ్రీశైలంలో అశ్వవాహనంపై సిద్ధిదాయినిగా దర్శనమిస్తారు.

శ్లో. సిద్ధ గంధర్వయక్షాద్యైరసరైరమరైరపి ! సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ !!

శుభం భూయాత్

డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము