రికార్డు స్థాయిలో తగ్గిన శిశు మరణాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దూరదృష్టి వల్లే రికార్డు స్థాయిలో శిశు మరణాలు తగ్గాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో శిశు మరణాల రేటు రికార్డు స్థాయిలో తగ్గినట్లుగా తాజాగా నివేదికలు వెలువడ్డాయి.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక-2023 (Sample Registration System Report-2023) ప్రకారం.. 2013లో దేశవ్యాప్తంగా 40 పాయింట్లుగా ఉన్న శిశు మరణాల రేటు 2023 నాటికి 25 పాయింట్లకు తగ్గింది. తెలంగాణలో ఈ రేటు 18గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి రేటు సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 44 నుంచి 28కి, పట్టణ ప్రాంతాల్లో 27 నుంచి 18కి తగ్గినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక-2023లో తేలింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో భారీగా తగ్గిన శిశు మరణాల రేటుపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎక్స్ ‘X’ వేదికగా పోస్టు పెట్టారు.
2011-13లో తెలంగాణ శిశు మరణాల రేటు (IMR) 41.2గా ఉండగా, 2021-23 నాటికి అది 18కి పడిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన 52 శాతం తగ్గుదలను సూచిస్తుందన్నారు. ఇది కేవలం కేసీఆర్ (KCR) దూరదృష్టి మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, తల్లి, బిడ్డ సంక్షేమ చర్యలు వేలాది ప్రాణాలను కాపాడాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఖాళీ వాగ్దానాలతో ప్రజలను మోసం చేసినప్పటికీ.. కేసీఆర్ దేశం గర్వించేలా ఉత్తమ ఫలితాలను అందించారని.. ఇదే నిజమైన తెలంగాణ మోడల్ అని పేర్కొన్నారు.
