బీసీ హాస్టల్‌లో ‘శక్తి యాప్‌’పై అవగాహన

  • మహిళల భద్రతే లక్ష్యం.. విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఐపీఎస్‌ ఆదేశాలు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ ఉత్తర్వుల మేరకు నందికొట్కూరు సర్కిల్‌ శక్తి టీం సిబ్బంది శనివారం పట్టణంలోని పగిడ్యాల రోడ్డు బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్‌ వార్డెన్‌ మహేశ్వరుడు అనుమతితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శక్తి టీం ఏఎస్సై ఎస్. ఖాదర్‌ బాషా, కానిస్టేబుల్‌ రసూల్‌ పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్‌ వినియోగం, శక్తి వాట్సాప్‌ నంబర్‌ 7993485111 గురించి విద్యార్థులకు వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో 112, 100 నంబర్లను ఎలా, ఏయే సందర్భాల్లో వినియోగించాలో తెలియజేశారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మహిళలు, బాలబాలికలతో ప్రతి ఒక్కరూ గౌరవంగా, మర్యాదగా మెలగాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సైబర్‌ నేరాల బారిన పడితే భయపడకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో శక్తి టీంలు నిరంతరం మహిళలు, విద్యార్థుల భద్రత కోసం పనిచేస్తున్నాయని సిబ్బంది తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.