తప్పు చేస్తే క్షమిస్తా… మోసం చేస్తే ఉపేక్షించను
- 36వ డివిజన్‌లో ఉత్సాహంగా ఇంటింటికీ దేశం కార్యక్రమం
ఏలూరు, ఆంధ్రప్రభ : తప్పును క్షమించవచ్చని, మోసాన్ని మాత్రం ముమ్మాటికీ సహించేది లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. మోసాన్ని ఉపేక్షిస్తే అది సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి ప్రభుత్వానికి పట్టం కట్టారని, వారికి ఒకవైపు ఆర్థిక మేళ్లు, మరోవైపు సంక్షేమ ఫలాలతో సుదీర్ఘ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతోందని తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారి ఆట కట్టించే లక్ష్యంతో కఠిన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 36వ డివిజన్ చేపలతూము సెంటర్‌లో పార్టీ డివిజన్ ఇన్‌చార్జి చల్లా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.
అనంతరం డివిజన్‌లోని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాంతంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా ప్రశాంతతకు భంగం కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు నియోజకవర్గంలో పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పోకడలు నేటికీ అనేక ప్రాంతాల్లో బహిర్గతమవుతున్నాయని వ్యాఖ్యానించారు. డ్వాక్రా సంఘాలకు కూడా కొందరు అవినీతి మరకలు అంటించారని ఆరోపించిన ఎమ్మెల్యే, అటువంటి వారి పనికట్టించే లక్ష్యంతో పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమృద్ధిగా అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసుకుంటూ ముందుకు సాగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అయితే కొందరు తమకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. 36వ డివిజన్‌లో అభివృద్ధిలో భాగంగా మూడు రోడ్లను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ డివిజన్‌కు సంబంధించి డ్వాక్రా సంఘాల్లో అవకతవకలు జరిగిన విషయం బహిర్గతమైందని పేర్కొన్న బడేటి చంటి, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పార్టీని బలహీనపరిచే చర్యలను కూడా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన అంతిమ లక్ష్యమని, ఈ విషయంలో అన్యాయంగా వ్యవహరించే వారి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తప్పును క్షమించవచ్చని, కానీ మోసాన్ని సహిస్తే అది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
