కార్యక్రమాన్ని వేగవంతం చేయండి: ఎమ్మెల్యే సునీత
- డోర్‌టుడోర్ కార్యక్రమంపై పార్టీ నేతలతో సమీక్ష
రాప్తాడు, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటికీ కార్యక్రమం, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఇంటింటికీ కార్యక్రమంలో 100 ఇళ్ల కంటే తక్కువగా తిరిగిన బూత్‌లను, ఇప్పటివరకు 50 శాతం కంటే తక్కువగా కార్యక్రమం పూర్తయిన ప్రాంతాలను ప్రధానంగా ప్రస్తావించారు.
కార్యక్రమం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఎందుకు నెమ్మదిగా సాగుతోందని ఎమ్మెల్యే ఆరా తీశారు. పార్టీ ఏదైనా కార్యక్రమాన్ని నిర్దేశించినప్పుడు దానిని కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డవారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అందజేసిన నోటీసులను పరిశీలించి, అవసరమైన వివరణ ఇవ్వాలని సూచించారు.
ఓటరు జాబితాలోని తప్పులు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఎవరైనా ఓట్లు కోల్పోయి ఉన్నా, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపైనా దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ సుధాకర్ నాయుడు, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, క్లస్టర్ ఇన్‌చార్జిలు సోమర నారాయణస్వామి, సి. రాము, గాండ్లపర్తి మాజీ సర్పంచ్ నరేష్, టీడీపీ నాయకులు గాండ్లపర్తి కురుబ నల్లప్ప, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
