విజయవాడలో సీబీఐ ట్రాప్‌.. అడ్డంగా బుక్కైన‌ రైల్వే ఇంజినీర్‌..

ఆంధ్ర‌ప్ర‌భ‌, విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌కు చెందిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ బాపిరాజును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేట్‌ వ్యక్తి శ్రీచంద్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. విజయవాడలో సీబీఐ అధికారులు చేపట్టిన ట్రాప్‌ ఆపరేషన్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్ట్‌ బిల్లుల మంజూరు, పనుల కేటాయింపులో అనుకూలంగా వ్యవహరించేందుకు కాంట్రాక్టర్‌ నుంచి బాపిరాజు రూ.15 లక్షలు లంచంగా తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రూ.179.50 కోట్ల విలువైన ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.7 కోట్ల బోనస్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బాపిరాజుతో పాటు ప్రైవేట్‌ వ్యక్తి శ్రీచంద్‌ పాత్రపై కూడా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

లంచం డబ్బులు చేతులు మారుతున్న సమయంలో సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్‌ నిర్వహించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో మరికొందరు రైల్వే అధికారులు లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన లావాదేవీలు, కాంట్రాక్ట్‌ పనులు, బిల్లుల మంజూరు వ్యవహారాలపై వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.