విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని ఆమిద్యాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం మాజీ శాసన సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు హిందీ నరసప్ప జ్ఞాపకార్థం ఆయన కుమార్తె, పాఠశాల భౌతిక శాస్త్ర సహాయకురాలు సాకే సుమిత్రాదేవి పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో నగదు బహుమతులు అందజేశారు.
పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ ర్యాంకు సాధించిన బాబా షరీఫ్‌కు రూ.5,000, ద్వితీయ ర్యాంకు సాధించిన అరవింద స్వామికి రూ.3,000, తృతీయ ర్యాంకు సాధించిన దివాకర్‌కు రూ.2,000 చొప్పున నగదు బహుమతులు అందజేసి వారి ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా సాకే సుమిత్రాదేవి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో మంచి పేరు, స్థాయిని సంపాదించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తి, పోటీతత్వం పెంపొందించేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు అందించిన సాకే సుమిత్రాదేవికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
