అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షం..!!

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మరికొద్దిసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ తాజా అప్‌డేట్‌లో తెలిపారు. శేరిలింగంపల్లి, మాదాపూర్‌, బోరబండ, సనత్‌నగర్‌, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్‌, బేగంపేట్‌, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, హిమాయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు చోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఓ వైపు ఎండకొడుతూనే చినుకులు కురుస్తున్నాయి.

అలాగే, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మెద్చల్‌, సిద్దిపేట, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇతర జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడొచ్చని, హైదరాబాద్‌లో ఉత్తర ప్రాంతాల్లో వచ్చే ఒకటి నుంచి రెండు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారత వాతావరణ శాఖ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తాజా సూచనల్లో పేర్కొంది.