ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తవుటం లక్ష్మి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి వాల్యానాయక్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ దగ్గు మల్లేష్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

పీఏసీఎస్‌లో చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల కార్యాలయాల్లో ఆయా అధ్యక్షులు దబ్బేట అనిల్, బుర్ర వెంకటేష్‌గౌడ్, అల్లం రవీందర్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు కట్కూరి మొగిలి జెండాను ఎగురవేశారు. మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో సర్పంచులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వివిధ రాజకీయ పార్టీలు, యువజన సంఘాల ప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.