నిబంధనలకు విరుద్ధంగా అటవీ ప్లాంటేషన్

చనిపోతున్న మొక్కలు.. వృథా కానున్న రూ.55 లక్షల నిధులు

వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు బీట్ పరిధిలో చిన్నగులగూడెం సమీపంలో 33 ఎకరాల అటవీ భూమిలో సుమారు రూ.55 లక్షల వ్యయంతో చేపట్టిన ప్లాంటేషన్ పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాంటేషన్ పనులను నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్లాంటేషన్‌లో మొక్కలు నాటేందుకు కూలీలతో గోతులు తీయించి మొక్కలు నాటాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా యంత్రాలతో గోతులు తీయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద గోతులు తీయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచి మొక్కలు కుళ్లిపోయి చనిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నాటిన కొద్దిరోజులకే మొక్కలు ఎండిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న మొక్కలతో ఇబ్బందులు..

ప్లాంటేషన్‌లో నాటాల్సిన మొక్కలు నిర్ణీత పరిమాణంలో ఉండాల్సి ఉండగా, కేవలం మీటరు నుంచి అర మీటరు ఎత్తు ఉన్న చిన్న మొక్కలను నాటినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మేకలు, ఆవులు మొక్కలను తినేస్తున్నాయని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షలాది రూపాయల వ్యయంతో చేపట్టిన ప్లాంటేషన్ ప్రారంభంలోనే దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు..

రూ.55 లక్షల వ్యయంతో చేపట్టిన పనులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నాణ్యత లోపిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం పనులు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వారి వివరణ తెలియాల్సి ఉంది. ప్లాంటేషన్ పనులను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిధులు వృథా కాకుండా చూడాలని ప్రాంతవాసులు కోరుతున్నారు.