విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
- కొండాపూర్ సర్పంచ్ రాఘవేందర్
నవాబుపేట, ఆంధ్రప్రభ : విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కొండాపూర్ సర్పంచ్ రాఘవేందర్ అన్నారు. శనివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. గ్రామంలోని విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి రావాలంటే వారికి సరైన ప్రోత్సాహం, అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.
గ్రామపంచాయతీ తరఫున పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలు అందించడంతో పాటు మైదానం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. మంచి క్రీడాకారుడిగా ఎదిగి గ్రామానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలరాజు, మండల విద్యాధికారి నాగ్య నాయక్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
