13 ఏళ్ల సేవకు అరుదైన గౌరవం..
- ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా వై.స్వరూపకు అవార్డు
నూగురు వెంకటాపురం, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల సంక్షేమానికి అంకితభావంతో సేవలందిస్తున్న వై.స్వరూపకు అరుదైన గౌరవం దక్కింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం-1 అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను ఉత్తమ అంగన్వాడీ టీచర్ అవార్డుకు ఎంపిక చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా స్వరూప అవార్డును అందుకున్నారు. గత 13 ఏళ్లుగా బోధపురం-1 అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న స్వరూప చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సేవలందిస్తున్నారు.
కేంద్రానికి వచ్చే చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్నారుల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పిస్తున్నారు. విధుల్లో భాగంగా చిన్నారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ మెరుగైన సేవలు అందించడం, అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో స్వరూప చూపుతున్న చొరవను అధికారులు గుర్తించారు. 13 ఏళ్లుగా తాను చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉందని స్వరూప తెలిపారు.
