బడా భీమ్‌గల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
లక్షలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మితమైన భారతదేశంలో స్వాతంత్ర్య సమరయోధుల జీవిత గాథలు నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. వారి దేశభక్తి, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాహుల్, వార్డు సభ్యులు ఆలూర్ అరుణ్, కాల్లకడి గంగాదాస్, కొండూరి నవీన్, గుర్రపు గీత, మల్లెల శ్రీకాంత్, చిత్తరి మేఘన, సూల్ల లత, కాల్లగడ్డ సత్తెవ్వ, పెద్దోల్ల మానస, చిరునాంచ రాజ్‌కుమార్, మాండ్ర సుమన్, కారోబార్లు నర్సయ్య, శేఖర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
