దేశ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి…

(అమరావతి- ఆంధ్రప్రభ) : స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎంతో సంతోషంగా, గర్వంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పెదకూరపాడు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు. అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా పనిచేస్తామని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూబాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని, ఐక్యతతో ముందుకు సాగుతూ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, బలమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.