Cheemalapahad-Railway-Station : ఆ రెండు రైళ్లు చాలు Andhra Prabha Ecclusive Story
Cheemalapahad-Railway-Station : ఆ రెండు రైళ్లు చాలు Andhra Prabha Ecclusive Story
- ప్లీజ్ ఒక్క నిముషం
- చీమలపహాడ్ వేడుకోలు
- అందరూ విద్యార్థులు..
- చిరువ్యాపారులే..
- ఎన్నాళ్లీ కష్టాలు
చీమలపహాడ్: రైల్వే స్టేషన్ ఉంది.. పట్టాలున్నాయి.. నిత్యం రైళ్లు వెళ్తున్నాయి.. కానీ ఆ రైళ్లు తమ ఊరిలో ఆగవు. రైలు కూత వినిపిస్తుంది.. కళ్లముందే దూసుకెళ్తుంది.. కానీ తమ అవసరాలకు మాత్రం అందుబాటులో ఉండదు. రైలు కూత చీమలపహాడ్ ప్రజలకు వినిపిస్తోంది..కానీ ఆ రైలు తలుపులు మాత్రం వారికి తెరుచుకోవడం లేదు.ఒక్క నిమిషం ఆపండి సార్.ఆ ఒక్క నిమిషం వేల కుటుంబాల జీవితాల్లో గంటల కష్టాన్ని తగ్గిస్తుంది. ఇదే చీమలపహాడ్, పరిసర గ్రామాల ప్రజల దుస్థితి.

(ఆంధ్రప్రభ, ఖమ్మం బ్యూరో)
చీమలపహాడ్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో సుమారు 20 వేల మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, వృద్ధులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లాలంటే సొంత వాహనం ఉండాలి.. లేకపోతే రైలే ప్రధాన ఆధారం. అయితే స్టేషన్‌లో అన్ని రైళ్లు ఆగకపోవడంతో ప్రజలకు ప్రయాణం నిత్య సమస్యగా మారింది.
కరోనా ముందు.. రైలే వారి జీవనాధారం కరోనా మహమ్మారి రాకముందు చీమలపహాడ్ మీదుగా నడిచే ప్యాసింజర్, లోకల్ రైళ్లు పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండే రైళ్లతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేవారు. చిన్నచిన్న పనుల కోసం సమీప పట్టణాలకు వెళ్లేవారు. వైద్యం కోసం ఆసుపత్రులకు చేరుకునేవారు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయగలిగే ఆ రైళ్లు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక రవాణా సాధనం మాత్రమే కాదు.. వారి జీవితాల్లో ఒక ముఖ్యమైన ఆధారం. కరోనా సమయంలో రైళ్ల రాకపోకల్లో మార్పులు రావడంతో కొన్ని ప్యాసింజర్ సర్వీసులు రద్దయ్యాయి. కాలం గడిచింది.. పరిస్థితులు సాధారణమయ్యాయి.. స్టేషన్ కూడా అభివృద్ధి చెందింది. కానీ ప్రజలు కోరుతున్న ప్రధాన రైళ్ల స్టాప్ మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
Cheemalapahad-Railway-Station : కళ్లముందే రైళ్లు.. ఆగవు
చీమలపహాడ్ ప్రజలకు ఇప్పుడు అత్యంత అవసరమైన డిమాండ్ ఒక్కటే కాదు.. కాకతీయ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా చీమలపహాడ్‌లో స్టాప్ కల్పించాలి అన్నది వారి ప్రధాన విజ్ఞప్తి. ఈ రెండు రైళ్లు చీమలపహాడ్ ప్రజలకు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, మణుగూరు, ఇతర ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
“మాకు కొత్త రైలు కావాలని అడగడం లేదు.. కొత్త రైల్వే లైన్ వేయాలని కోరడం లేదు.. ఇప్పటికే మా ప్రాంతం మీదుగా నడుస్తున్న రైళ్లను మా స్టేషన్‌లో ఒక్క నిమిషం ఆపాలని మాత్రమే అడుగుతున్నాం” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ వెళ్లాలంటే..

హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళ్లాల్సిన వృద్ధుడైనా.. పరీక్ష కోసం నగరానికి వెళ్లాల్సిన విద్యార్థైనా.. ఉద్యోగం కోసం బయలుదేరే యువకుడైనా.. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లాల్సిన కుటుంబమైనా.. రైలు అందుబాటులో ఉంటే ప్రయాణ ఖర్చు, సమయం రెండూ తగ్గుతాయి.
Cheemalapahad-Railway-Station : పరిస్థితి మరీ దారుణం
చీమలపహాడ్ నుంచి హైదరాబాద్ లేదా ఇతర ప్రధాన పట్టణాలకు వెళ్లాలంటే ముందుగా మరో స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి రైలు ఎక్కాలి. తిరిగి వచ్చే సమయంలోనూ అదే ఇబ్బంది. ఒక చిన్న ప్రయాణం కోసం సమయం, డబ్బు రెండూ ఎక్కువగా ఖర్చవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాకతీయ ఎక్స్‌ప్రెస్, మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్లకు చీమలపహాడ్‌లో హాల్ట్ లభిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రోగులు, వృద్ధులు, పేద కుటుంబాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని ప్రజలు అంటున్నారు. వినతులు ఎన్నో.. స్పందన మాత్రం ఎక్కడ?
ఈ రెండు రైళ్లకు చీమలపహాడ్‌లో స్టాప్ కల్పించాలని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సభ్యులు పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు చెబుతున్నారు. ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా కూడా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని స్థానికులు వాపోతున్నారు.
ఏళ్లుగా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఒక్క నిమిషం.. వేల కుటుంబాలకు ఊరట ఒక రైలు ఒక స్టేషన్‌లో ఒక్క నిమిషం ఆగడం రైల్వే పరంగా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ ఆ ఒక్క నిమిషం ఒక విద్యార్థికి కళాశాలకు చేరుకునే అవకాశం కావచ్చు. ఒక వృద్ధుడికి ఆసుపత్రికి వెళ్లే మార్గం కావచ్చు. ఒక ఉద్యోగార్థికి ఇంటర్వ్యూకు చేరుకునే అవకాశం కావచ్చు. ఒక పేద కుటుంబానికి వందల రూపాయల అదనపు ప్రయాణ
Cheemalapahad-Railway-Station : ఖర్చు తగ్గే చాన్స్

అందుకే చీమలపహాడ్ ప్రజల ప్రశ్న ఒక్కటే..“మా స్టేషన్ మీదుగా రైళ్లు వెళ్తున్నప్పుడు.. మా కోసం ఒక్క నిమిషం ఎందుకు ఆగకూడదు?”
రైల్వే అధికారులు ప్రజల విజ్ఞప్తిని మరోసారి పరిశీలించాలి. చీమలపహాడ్ పరిసర గ్రామాల జనాభా, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య అవసరాలు, రోజువారీ ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాకతీయ ఎక్స్‌ప్రెస్, మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రెండింటికీ చీమలపహాడ్‌లో హాల్ట్ కల్పించాలి. అదే జనం వినతి .
