మహనీయుల త్యాగాలకు ప్రతిఫలమే స్వాతంత్య్రం

భూపాలపల్లి (ఆంధ్రప్రభ): ఎందరో మహనీయుల త్యాగాలకు వెలకట్టలేని బహుమతే స్వాతంత్య్రమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్‌కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతం, తెలంగాణ గీతాలాపన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు బలగాల పరేడ్ మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించిన అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆస్తులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందజేశారు. అనంతరం ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.