వర్షాభావ పరిస్థితులకు అల‌సు కార‌ణం ఇదే !!

  • తెలంగాణకు వర్షాల కోసం తప్పని ఎదురుచూపులు

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి.. వాతావరణం మారుతోంది.. వర్షం పడుతుందేమోనని ఆశలు చిగురిస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో చినుకులు కూడా కనిపించకుండానే మేఘాలు దూరమవుతున్నాయి. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాల తీరు ఇలాగే మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి.

సాధారణంగా వర్షాల లోటు కనిపిస్తే అందరి దృష్టి ఎల్‌నినో ప్రభావంపైనే ఉంటుంది. ఇన్నిరోజులు అదే కారణమైనప్పటికీ, ప్రస్తుత వర్షపాత పరిస్థితులకు వేరే కారణం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు (ఎల్‌పీఏలు) ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయన్నదే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితిని నిర్ణయిస్తోంది.

ప్రస్తుతం, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌-ఒడిశా తీర ప్రాంతాల నుంచి ఉత్తర, మధ్య భారత వైపు కదులుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ఆ ప్రభావం పూర్తిస్థాయిలో చేరడం లేదు. అల్పపీడనాలు దక్షిణ దిశగా ప్రయాణిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రాంతాలకు మంచి వర్షాలు అందే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అవి కొనసాగుతున్న మార్గం దక్షిణాది వర్షాలకు అనుకూలంగా లేకపోవడంతో వర్షాల లోటు కొనసాగుతోంది.

మేఘాలను తరలిస్తున్న బలమైన గాలులు..

దక్షిణాది ప్రాంతాల్లో మరో ప్రధాన సమస్య బలమైన గాలులు. ప్రస్తుతం గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వర్ష మేఘాలను ఎక్కువసేపు ఒకే ప్రాంతంలో నిలవనివ్వడం లేదు. దీంతో బలమైన మేఘాలు ఏర్పడినా.. అవి కొద్ది సమయంలోనే మరో ప్రాంతానికి తరలిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వర్షం కురిసే వాతావరణం కనిపించినా.. కేవలం 10 నుంచి 20 నిమిషాల్లోనే మేఘాలు దూరం కావడంతో భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి లేకుండా పోతోంది.

జూలై చివరి వాయుగుండం మినహా అదే పరిస్థితి

జూలై చివర్లో ఏర్పడిన వాయుగుండం సమయంలో మాత్రమే దక్షిణాది ప్రాంతాలకు కొంత వర్ష ప్రభావం కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అల్పపీడనాల మార్గం ఉత్తర భారత వైపు ఉండటంతో వర్షాల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ నెల మొత్తం దాదాపు ఇదే వాతావరణ నమూనా కొనసాగుతోందని వాతావరణ పరిశీలకులు చెబుతున్నారు.

ముందు 15 రోజులు కీలకం

రాబోయే 15 రోజుల్లో బంగాళాఖాతంలో మరో 2 నుంచి 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. అయితే కొత్తగా ఏర్పడే ఈ అల్పపీడనాలు కూడా ప్రస్తుత మార్గంలోనే కొనసాగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనాల ప్రయాణ దిశ దక్షిణం వైపు మళ్లితేనే దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృత వర్షాలకు అవకాశాలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల రైతులు, ప్రజలు బంగాళాఖాతంలో ఏర్పడే తదుపరి అల్పపీడనాల వైపు ఆశగా చూస్తున్నారు. అల్పపీడనం దారి మారితేనే వర్షాల లోటు కొంతవరకు తీరే అవకాశం ఉందని వాతావరణ వర్గాలు చెబుతున్నాయి.