తప్పు చేయకుండా పనిచేయండి.. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చండి
నర్సాపురంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విస్తృత తనిఖీలు
నర్సాపురం, ఆంధ్రప్రభ: పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు వారికి పూర్తి స్థాయిలో అందేలా చూడాలని, వారి కడుపు కొట్టే పనులకు పాల్పడవద్దని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సూచించారు. నర్సాపురం నియోజకవర్గంలో శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల వార్డెన్లు బాధ్యతగా పనిచేయాలని, ఎలాంటి తప్పులకు తావులేకుండా విధులు నిర్వహించి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలు, ఎంఎల్పాయింట్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, చాలా వరకు వ్యవస్థలు గాడిలో పడ్డాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం నాణ్యంగా అందిస్తున్నారని తెలిపారు. వసతి గృహాలకు సరుకులు సరఫరా చేసే సమయంలో అత్యాశకు పోకుండా నాణ్యమైన సరుకులను అందించాలని సూచించారు.
వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని, వారికి సంతృప్తికరమైన భోజన వసతులు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భోజన వసతుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఎంతో బాగుందని, ప్రధానోపాధ్యాయుడు పెద్దిరాజు పనితీరు ఆదర్శనీయమని ప్రశంసించారు. ఆయనను ప్రత్యేకంగా సన్మానించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో తాను పరిశీలించిన అన్ని ప్రాంతాలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు.
రేషన్ చక్కెర ధర రూ.17 మాత్రమే
రేషన్ డీలర్లకు సంబంధించిన కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఎంఎల్పాయింట్ నుంచి తూకం ప్రకారం బియ్యం అందడం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
రేషన్ షాపుల్లో కిలో చక్కెరకు రూ.17 మాత్రమే చెల్లించాలని, కొందరు డీలర్లు కిలోకు రూ.20 వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేషన్ సరఫరా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
