నేటి నిర్ణయమే రేపటి విజయానికి పునాది
యువతకు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పిలుపు
ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ: యువత మంచి ఆలోచనతో సరైన నిర్ణయాలు తీసుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ సూచించారు. ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్కులో శుక్రవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ,యువజన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ అడ్మిన్ వై. ప్రతాప్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో జరిగిన చిన్న పొరపాట్లు లేదా అనుకోని పరిస్థితులు యువత భవిష్యత్తుపై శాశ్వత ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు పోలీసు శాఖతో పాటు సంక్షేమ శాఖల ద్వారా పూర్తి స్థాయిలో మార్గదర్శకత్వం అందిస్తామని చెప్పారు.
యువత ఐటీఐ, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, డెలివరీ సర్వీసెస్ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అభివృద్ధి చెందాలనుకునే యువతకు అన్ని శాఖల సమన్వయంతో సబ్సిడీ రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
యువత తమ తల్లిదండ్రులు గర్వపడేలా మంచి మార్గాన్ని ఎంచుకుని సమాజంలో ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా ఎదగాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీపీఓ డాక్టర్ సూర్య చక్రవేణి, చైల్డ్ అండ్ వెల్ఫేర్ శాఖ అధికారులు, వసతి గృహాల అధికారులు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
