ఏలూరులో హర్ ఘర్ తిరంగా హోరు
దేశభక్తి నినాదాలతో మార్మోగిన నగరం.. భారీ తిరంగా ర్యాలీ
ఏలూరు, ఆంధ్రప్రభ: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటింది. వన్‌టౌన్ పేరయ్య కోనేరు నుంచి పాత బస్టాండ్ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.
దేశభక్తి నినాదాలతో పేరయ్య కోనేరు నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ప్రధాన రహదారులు మార్మోగాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని, దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు.
ర్యాలీకి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలుచోట్ల ప్రజలు ర్యాలీని ఆసక్తిగా తిలకిస్తూ దేశభక్తి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం పాత బస్టాండ్ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. జాతీయ జెండాలతో ప్రజలు ఒకే వరుసలో నిలిచి జాతీయ సమైక్యత, ఐక్యతా భావాన్ని చాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదని, దేశం పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యత, గౌరవం, దేశభక్తి భావాలను పెంపొందించే కార్యక్రమమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్ది పోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు, కూటమి పార్టీల క్లస్టర్ ఇన్చార్జిలు, డివిజన్ ఇన్చార్జిలు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
