సమన్వయంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
- అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, ఆంధ్రప్రభ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
మునుగోడు మండల పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచులు ఎన్నికైన తర్వాత తొలిసారిగా శుక్రవారం నిర్వహించిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి నివేదికలను ఎమ్మెల్యేకు వివరించారు.
విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వ్యవసాయం, రహదారులు, రెవెన్యూ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించాలని పేర్కొన్నారు. ప్రజల అనారోగ్యానికి కలుషిత నీరు ప్రధాన కారణమని పేర్కొన్న ఎమ్మెల్యే.. గ్రామాల్లో తాగునీరు, బోరు నీటికి వేర్వేరు ట్యాంకులు నిర్వహిస్తున్నారా అని అధికారులను ప్రశ్నించారు. రెండు రకాల నీటికి ప్రత్యేక ట్యాంకులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
మునుగోడు నియోజకవర్గంలో సుమారు 400 రహదారుల అభివృద్ధి పనులు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రెండున్నరేళ్లు సమష్టిగా పనిచేస్తే గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించవచ్చన్నారు.
గ్రామాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. బెల్ట్‌షాపుల నిర్మూలనతో పరిస్థితి కొంత మెరుగుపడిందని, చాటుమాటుగా మద్యం విక్రయించే వారిని కూడా అడ్డుకోవాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యదర్శులు సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారికి నియోజకవర్గంలో స్థానం ఉండదని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, డీపీవో తరుణ్ చక్రవర్తి, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, మండల ప్రముఖులు పాల్గొన్నారు.
