సీపీఎం పార్టీలో చేరిన 30 కుటుంబాలు..

  • పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన
  • సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య
  • జిల్లా కార్యదర్శి బోడేంకి చందు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని దండేపల్లి, కర్ణపేట్, శ్యామ్‌గూడెం గ్రామాలకు చెందిన సుమారు 30 కుటుంబాల నుంచి 50 మంది సీపీఎం పార్టీలో చేరారు. సీపీఎం పార్టీ నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

గతంలో సీపీఐలో పనిచేసిన పెరుక రాజేశం, కర్ణపేట్ మాజీ సర్పంచ్ మారినేని రాజేశ్వరి, మూడ్తె మహేష్, రాధాబాయి, నిరటి కమల ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు చెందిన సుమారు 50 మంది సీపీఎంలో చేరారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి బోడేంకి చందు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కనికారపు అశోక్‌ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీపీఎం పార్టీ పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న పార్టీ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి, రైతు ఉద్యమాలకు మద్దతుగా నిలిచి, ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా నిధుల్లో కోత విధిస్తోందని ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం సీపీఎం చేస్తున్న పోరాటాలను గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని కోరారు.

సీపీఎం పార్టీ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల సీపీఎం నాయకులు రాజులింగ్, జీతం జాడి, రేణుక, మాత్రం పుణ్యభాయ్, మొశ్రం మీరాబాయి, అమరావతి తిరుమల తదితరులు పాల్గొన్నారు.