టైగర్ జోన్‌లో అడవి పందుల సందడి..

  • వాహనదారులను ఆకట్టుకున్న దృశ్యం

జన్నారం, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్‌ జోన్‌లోని అడవుల్లో అడవి పందులు విహరిస్తూ చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బీర్సాయిపేట అడవుల్లో మంచిర్యాల–ఆదిలాబాద్‌ రాష్ట్ర రహదారి పక్కన శుక్రవారం సాయంత్రం అడవి పందుల గుంపు కనిపించింది.

హిట్కాస్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ప్రశాంత్‌కు ఈ అడవి పందుల గుంపు కనిపించగా, వెంటనే తన కెమెరాలో వాటిని చిత్రీకరించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపి అడవి పందులను ఆసక్తిగా తిలకించారు.

చాలామంది వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో అడవి పందుల దృశ్యాలను చిత్రీకరించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ మాట్లాడుతూ.. అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న అడవి పందుల మందను చూడటం, వాటి చిత్రాలను తీయడం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.