ChandraBabu |నీటి నిర్వహణపై సీఎం కీలక ఆదేశాలు

  • వాటర్ మూమెంట్ ప్లాన్ అమలు
  • ప్రాధాన్యతా ప్రాజెక్టులకు వేగం
  • నెలవారీ లక్ష్యాలతో పనులు పూర్తి
  • డేటా సెంటర్లకు త‌ప్పుడు సమాచారం
  • జల వనరులపై సీఎం సమీక్ష

అమరావతి, ఆంధ్ర‌ప్ర‌భ‌: రాష్ట్రంలో వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రస్తుతం లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వల్ని, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని సూచించారు.

రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార- జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు.

పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు జల వనరుల శాఖ సీఎంకు తెలిపింది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు శరవేగంగా చేపట్టామని వివరించారు. ఇటీవల 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు గోదావరికి వచ్చినా ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించినట్టు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రహదారులతో పాటు డ్యామ్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు కూడా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలో గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్ ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వచ్చే ఏడాది మార్చి కల్లా విశాఖ వరకూ ఎడమ కాలువ బ్యాలెన్సు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈలోగా అనకాపల్లి వరకూ ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిని నింపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలవరం కుడి ఎడమ కాలువల్లో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా పనులు చేయాలని స్పష్టం చేశారు. రెండు కాలువలకూ మంచి పేర్లను సూచించాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవటంతో పాటు పర్యాటకం గానూ తీర్చిదిద్దాలన్నారు.

డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీరు చాలు..

డేటా సెంటర్లకు నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. మొత్తంగా వాటికి 3.5 టీఎంసీల నీరే సరిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో తాగు నీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ తదుపరి పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ సీజన్ లో ఆరు తడి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగేలా జల ధార- జల హారతి పనుల్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పుష్కలంగా నీటి వనరులు ఉన్న రాష్ట్రంగా గోదావరి నీటిని అటు ఉత్తరాంధ్రకు, ఇటు కృష్ణా డెల్టా ప్రాంతానికి అవసరమైనంత మేర నీరు తీసుకునే ఆస్కారం ఉందన్నారు. విశాఖ నుంచి అమరావతి వరకూ అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న భూముల్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలను అధ్యయనం చేయాలని అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయటంతో పాటు నిర్వాసితుల సమస్యల్ని కూడా మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోకా పూర్తి చేయాలన్నారు. దీనికోసం నెల వారీ లక్ష్యాలను నిర్దేశించు కోవాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఆయకట్టుకు నీరిచ్చే అంశాన్ని కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ, సీఈలు హాజరయ్యారు.