ఏజెన్సీ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి..

  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు వినతిపత్రం అందించిన సర్ మేడిలు నాయకులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్‌ ఏజెన్సీ పరిధిలోని జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయా మండలాల రాయి సెంటర్ల సర్‌మెడీలు, ఆదివాసీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుమత విశ్వనాథరావు, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌ తదితరులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జైనూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మూడు మండలాల సర్‌మెడీలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

జైనూర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఆదివాసీలపై నమోదైన కేసుల అంశాన్ని పరిష్కరించాలని, ఐటీడీఏ ద్వారా ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జీఓ ఎంఎస్‌ నెం.109 ప్రకారం పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో 75 శాతం స్థానిక ఆదివాసీ యువతకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనాదిగా సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలని, ఏజెన్సీ ప్రాంత రక్షణకు కీలకమైన 1/70 చట్టం, పేసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు మండలాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఆదివాసీ నాయకుల విజ్ఞప్తులపై ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే రాయి సెంటర్‌ పెద్దలతో ముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుమత విశ్వనాథరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌, సర్‌మెడీలు గేడం గణపత్‌రావు, మెస్రం బాదిరావు, ఆత్రం ఆనంద్‌రావు, ఆత్రం మక్తూర్‌షా, తుడుందెబ్బ కుమురం భీం జిల్లా అధ్యక్షుడు గేడం గోపీచంద్‌, ఏఎస్‌పీ జిల్లా గౌరవ అధ్యక్షుడు మెస్రం షేకు, సర్పంచులు మాడావి మనోహర్‌, పెందుర్‌ గణపత్‌రావు, మెస్రం స్పందన భూపతి, మాజీ సర్పంచ్‌ శ్యామ్‌రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.