సామాజిక సమానత్వం కోసం పోరాటం: కాంగ్రెస్‌ నేతలు

భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ సభలో ప్రసంగించిన అనంతరం వేదికను ‘శుద్ధీకరణ’ పేరుతో ప్రక్షాళన చేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ నిరసన వ్యక్తం చేసింది.

ఈ ఘటనకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు సత్యాగ్రహ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ బలహీన వర్గాలు, దళిత నాయకుల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరి ఆందోళనకరంగా ఉందని విమర్శించారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడి పట్ల వేదిక శుద్ధీకరణ పేరుతో వ్యవహరించడం అవమానకరమని, ఇది సామాజిక వివక్షను ప్రతిబింబిస్తోందని ఆరోపించారు.

ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు స్పందించాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పెదబాబు, పూణెం శ్రీనివాస్‌, సర్పంచులు అజ్మీరా లైలా, బానోత్‌ రాణి, కొంపెల్లి వీరయ్య, దయ్యాల సమ్మయ్య, బండ వెంకటేశ్వర్లు, పాయం లక్ష్మీనర్సు, వర్స నరసింహారావు, చింత రమేష్‌, బరపటి శ్రీనివాసరావు, తాండ్ర కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.