బొడ్రాయి పవిత్రతకు భంగం..

  • భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న పంచాయతీ కార్యాలయం
  • పాత భవనంలోకి మార్చాలని డిమాండ్

ఉప్పునుంతల, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే బొడ్రాయి ప్రాంగణంలో గ్రామపంచాయతీ భవనం నిర్మించడంతో పవిత్రతకు భంగం కలుగుతోందని ఉప్పరపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామంలోని బొడ్రాయి స్థలంలో 2024లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్‌ బొజ్జ గీతా అమరేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పేర్కొన్నారు.

ఒకే ప్రాంగణంలో పలు కార్యాలయాలు

గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు అదే ప్రాంగణంలో పోస్టాఫీసు, ఆరోగ్య కేంద్రం కూడా ఉండటంతో వివిధ పనుల నిమిత్తం పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో బొడ్రాయి ప్రాంగణంలోకి చెప్పులతో వెళ్లడం, స్థలాభావంతో అక్కడే ఆహారపానీయాలు తీసుకోవడం వంటి పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో బొడ్రాయి పవిత్రత దెబ్బతింటోందని, భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీర్మానం చేసినా మార్పు లేదు

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పాత భవనంలోకి మార్చాలని గతంలోనే పాలకవర్గం తీర్మానం చేసినట్లు సర్పంచ్‌ బొజ్జ గీతా అమరేందర్‌రెడ్డి తెలిపారు. అయితే ఇప్పటివరకు కార్యాలయాన్ని మార్చకపోవడంతో సమస్య కొనసాగుతోందన్నారు. పాత గ్రామపంచాయతీ భవనం విశాలంగా ఉండటంతో పాటు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

బొడ్రాయి పవిత్రతను కాపాడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పాత భవనంలోకి మార్చాలని సర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యను ఇప్పటికే పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.