సాగునీరు చెరువులకు.. పొలాలకు కష్టాలు

  • చౌడుబారుతున్న చేలు.. రైతుల ఆవేదన
  • రొయ్యల చెరువులపై రైతుల గళం
  • ఈలప్రోలు, కవులూరులో రైతుల ఆందోళన

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఈలప్రోలు, కవులూరు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వెలసిన చేపలు, రొయ్యల చెరువులను నిర్మూలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన సాగునీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించి రైతుల పంటలకు నీరు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలే తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు చుక్క నీరు అందని పరిస్థితి ఉందన్నారు. కాలువల ద్వారా పంటలకు సాగునీరు సరఫరా కాకుండా అడ్ఢుకుంటున్నారని మండిపడుతున్నారు. చెరువుల చుట్టూ కట్టల ఎత్తు పెంచి కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారని, తమ భూములకు నీరు అందనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువుల నీటిలో ఉప్పు కళ్లు కలపడం వల్ల వ్యవసాయ భూములు చౌడు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేపలు, రొయ్యల చెరువులను నిర్మూలించి తమ పంట భూములకు సాగునీరు అందించేలా చూడాలని ఈలప్రోలు, కవులూరు రైతులు కోరుతున్నారు.