పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా పాలన లక్ష్యం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి, మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, మాజీ ఎంపీపీ మణెమ్మ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత గూడు కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో ఎంపీడీవో పావనితో కలిసి వారు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఇంటిలో గృహప్రవేశం నిర్వహించి లబ్ధిదారుల కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద కుటుంబాలకు భద్రతతో పాటు ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులు సొంత ఇంటిలోకి చేరేలా చర్యలు తీసుకోవాలనిఅన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
