ఆలేరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..
- 100 మీటర్ల జాతీయ పతాకంతో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన
ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ తడిసిన మల్లారెడ్డి, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్ మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేవారని, దేశంలోని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా భిన్న మతాలు, కులాలు ఉన్న దేశంలో జాతీయ భావం, ఐక్యత మరింత పెంపొందుతుందని అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. ఆలేరు ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి దుర్గమ్మ గుడి వరకు 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, కౌన్సిలర్లు బొట్ల సంపత్, పాశికంటి సంపత్, ప్రధాన కార్యదర్శులు ఏలగల వెంకటేష్, అంకిరెడ్డి శ్రీనివాస్, శేషత్వం అమరేందర్, జిల్లా నాయకులు వడ్డేమాన్ నరేందర్, తోట మల్లయ్య, పంపరి లక్ష్మీనారాయణ, తునికి దశరథ తదితరులు పాల్గొన్నారు.
