Tirupati | పుత్తూరులో విషాదం…
Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా పుత్తూరులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పుత్తూరులోని ద్రౌపతమ్మ–ధర్మరాజుల ఉత్సవాల సందర్భంగా కె.ఎన్. రోడ్డులోని పూజా టెక్స్టైల్స్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు కొంతమంది విద్యార్థులు వెళ్లారు. ఫ్లెక్సీ కడుతున్న సమయంలో అది సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను విగ్నేష్ (19), గోకుల్ (18)గా గుర్తించారు.
మృతులు స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్సవాల వేళ జరిగిన ఈ విషాదంతో పుత్తూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
