ఎల్ నినో ముప్పు.. కర్నూలు సోనాకు కష్టకాలం.. బియ్యం ధరలకు సెగ?

  • ప్రాజెక్టుల్లో నిరాశాజనకంగా నీటి ప్రవాహాలు
  • వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి
  • జాతీయ బ్రాండ్ కర్నూలు సోనాపై దెబ్బ
  • వందలాది రైస్ మిల్లులకు మూతపడే ప్రమాదం
  • బియ్యం కొరతతో సామాన్యుడిపై ధరల భారం
  • రైతులను ఆదుకోవాలని వ్యవసాయ సంఘాల డిమాండ్

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు సోనా (బిపిటి 5204) బియ్యం బ్రాండ్‌కు ఈ తీవ్ర గండం వచ్చిపడింది. వాతావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఎల్ నినో ప్రభావంతో కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో, పంట కాల్వల కింద వరి సాగుకు నీటిని విడుదల చేయలేమని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు.

తాగునీటికే ప్రాధాన్యం.. ఆరుతడి పంటలే సాగు

ముందస్తు అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, ప్రాజెక్టుల్లోకి వచ్చే అరకొర నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగును పూర్తిగా నిలిపివేసి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, ఆముదం, మినుము, పెసర, జొన్న లాంటి పంటల సాగువైపు మళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల కింద ప్రతిఏటా సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. సగటున నంద్యాల జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో, కర్నూలు జిల్లాలో 50 వేల ఎకరాల్లో వరిని సాగు చేస్తారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు కేవలం 400 ఎకరాల్లో మాత్రమే, అదీ బోరు బావుల కింద నాట్లు పడ్డాయి. అంటే మొత్తం ఆయకట్టులో సాగు ఒక శాతం కంటే తక్కువ నమోదైంది.

జాతీయ బ్రాండ్‌పై దెబ్బ.. మార్కెట్ నెట్‌వర్క్ చిన్నాభిన్నం

కర్నూలు సోనా కేవలం ఒక రకం వరి మాత్రమే కాదు, అదొక జాతీయ బ్రాండ్. నగరాల్లోని కిరాణా షాపుల నుంచి సూపర్ మార్కెట్ల వరకు ఇక్కడ ఒరిజినల్ కర్నూలు సోనా లభించును అనే బోర్డులు కనిపించడం సర్వసాధారణం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలతో పాటు పశ్చిమ ఆసియా (గల్ఫ్) దేశాలకు ఇక్కడి నుంచి భారీగా బియ్యం ఎగుమతి అవుతాయి.

మిల్లులు మూతపడే ప్రమాదం

వరి దిగుబడి లేకపోతే జిల్లాలోని వందలాది రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. రైస్ మిల్లులు మూతపడితే వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. దీనిపై ఆధారపడ్డ హమాలీలు, రవాణా రంగానికి చెందిన కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

సామాన్యుడికి ధరల వేడి

ఇప్పటికే మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతుండగా, సోనా మసూరి రకం బియ్యం కొరత పేద, మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బియ్యం కిలో రూ.60 నుంచి రూ.80 దాకా విక్రయమవుతోంది. సగటున కర్నూలులో రూ.60 నుంచి రూ.68ల దాకా ఉంది. హైదరాబాద్‌లో రూ.65 నుంచి రూ.72ల మధ్య, బెంగళూరులో రూ.70 నుంచి రూ.78ల దాకా ఉంది, నగరంలో రూ.65 నుంచి రూ.75ల దాకా ఉంది.

ఈ ఏడాది కొత్త పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం లేకపోవడం, నిల్వ ఉన్న బియ్యంతో ధరలు కిలో రూ.100లు దాటే ప్రమాదం ఉందని ధాన్యపు వర్తకులు హెచ్చరిస్తున్నారు.

వరి వేయవద్దని చెప్పడమే కాకుండా, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు ఉచితంగా లేదా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే, పంటకాలువలపై ఆధారపడిన కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పరిహార ప్యాకేజీని ప్రకటించాలని వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఏది ఏమైనా, ఎల్ నినో ప్రభావంతో ఏర్పడ్డ వర్షాభావం కారణంగా రూపురేఖలు కోల్పోతున్న కర్నూలు సోనా వైభవాన్ని నిలబెట్టడం, అదే సమయంలో సాగునీరు లేక కంటనీరు పెడుతున్న రైతులను ఆదుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.