రాజకీయాల్లోనూ ఓ లిమిట్ ఉంటుంది..
యరపతినేని శ్రీనివాసరావు
గుంటూరు, ఆంధ్రప్రభ : రాజకీయాల్లోనూ ఓ పరిమితి ఉంటుందని, ఆ హద్దులు దాటితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘రప్పా.. రప్పా’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించిన యరపతినేని.. నరికే ఆ మగాడు ఎవరో చెప్పండి.. మేం కూడా చూస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సమయంలో ఆమెను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుందని, ఆ పరిమితి దాటితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
వైసీపీ హయాంలో హత్యా రాజకీయాలను పెంచి పోషించారని ఆరోపించిన ఆయన.. కూటమి ప్రభుత్వం అలాంటి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉందన్నారు. సీదిరి అప్పలరాజును పరామర్శించే పేరుతో ఐదు గంటల పాటు ప్రదర్శన నిర్వహించారని విమర్శించారు. విరూపాక్ష అరెస్టు వద్దని, ముందుగా నోటీసులు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ అంటున్నారని పేర్కొన్న యరపతినేని.. నంద్యాల ఘటనలో చంద్రబాబును నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సవాల్ విసిరారు. వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇలాంటి వింత పోకడలతో గతంలో అనేక రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని, వైసీపీకి కూడా అదే పరిస్థితి తప్పదని యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
