గన్నవరం నుంచి 2 కొత్త విమానాలు!
- వారణాసి.. కోల్‌కతాకు నేరుగా!
- ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
- తొలి విమానానికే 130 మంది ప్రయాణికులు
గన్నవరం, ఆంధ్రప్రభ: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్‌కతా నగరాలకు ఇండిగో నూతన విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసులను ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్చువల్‌గా ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విమాన సర్వీసులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారణాసి తొలి విమాన సర్వీసుకే సుమారు 130 మంది ప్రయాణికులు బుక్ చేసుకోవడం విజయవాడకు ఉన్న విమానయాన సామర్థ్యాన్ని చాటుతుందన్నారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి కొచ్చిన్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలని ఇండిగో ప్రతినిధులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఈ ఏడాదిలోనే గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి మరిన్ని నగరాలకు విమాన అనుసంధానం కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. వారణాసికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించడం వల్ల భక్తులకు ప్రయాణ సమయం, ఖర్చు తగ్గి మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అనేక మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో నివసిస్తున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ కనెక్టివిటీ ఏర్పడితే ఈ ప్రాంత అభివృద్ధికి అది గేమ్‌చేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఇండిగో సంస్థ షెడ్యూల్ ప్రకారం వారణాసి నుంచి మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరే విమానం సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.20 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8.15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. వారానికి మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. అదే విమానం వారణాసి–కోల్‌కతా మార్గంలో కూడా సేవలు అందించనుంది. టికెట్ ధరలు సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్య ఉండనున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ రామ చారి,ఇండిగో స్టేషన్ మేనేజర్ కౌశిక్ విశాల్ , ఇండిగో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డ
