independence day | జాతీయ పతాకం విషయంలో ఇది ఎప్పుడైనా గమనించారా!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆగస్టు 15 వచ్చేసింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటం, అమరవీరుల త్యాగాలు, దేశం సాధించిన ప్రగతికి త్రివర్ణ పతాకం ప్రతీక.
అయితే ఓ విషయం ఎప్పుడైనా గమనించారా! ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేస్తాం.. జనవరి 26న మాత్రం ఆవిష్కరిస్తాం. జెండా విషయంలో ఈ రెండు పదాలను సాధారణంగా ఒకే అర్థంలో ఉపయోగించినా.. అధికారికంగా చూస్తే రెండింటి వెనుక భిన్నమైన భావం ఉంది. అసలు స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాను ఎగురవేయడం.. గణతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడం.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఎప్పుడైనా గమనించారా..!! జాతీయ పతాకానికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయాన్నీ తెలుసుకుందామా..
జాతీయ జెండాను ఎగురవేయడం అంటే..
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తాం. దీనికి ప్రత్యేకమైన అర్థం ఉంది. సాధారణంగా జెండాను స్తంభం అడుగు భాగంలో మడిచి ఉంచి, తాడు సాయంతో పైకి లాగుతారు. జెండా పైకి చేరే క్రమంలో మువ్వన్నెల పతాకం విచ్చుకుంటూ రెపరెపలాడుతుంది. ఇది స్వేచ్ఛను సాధించిన కొత్త భారతదేశం పైకి ఎదుగుతున్నదనే భావనకు ప్రతీకగా నిలుస్తుంది.
1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందింది. శతాబ్దాల పోరాటం, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వేచ్ఛ లభించింది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం రోజున కింది నుంచి పైకి జెండాను ఎగురవేయడం.. స్వేచ్ఛా భారత ఆవిర్భావాన్ని, కొత్త ఆరంభాన్ని గుర్తుచేస్తుంది.
జెండాను ఆవిష్కరించడం అంటే..
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తాం. ఇక్కడ జెండాను కింది నుంచి పైకి తీసుకెళ్లరు. ముందుగానే జాతీయ పతాకాన్ని స్తంభం పైభాగంలో మడిచి కట్టి ఉంచుతారు. అనంతరం అక్కడే దాన్ని విప్పుతారు. అంటే జెండా ఇప్పటికే పైభాగంలో ఉంటుంది.. కేవలం ఆవిష్కరించబడుతుంది.
దీనికి కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం తనకు తానే రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం గణతంత్రంగా అవతరించింది. అందుకే గణతంత్ర దినోత్సవం నాడు జెండా పైభాగంలో ఉండటం.. ఇప్పటికే స్వతంత్రంగా, సార్వభౌమంగా, రాజ్యాంగబద్ధంగా స్థిరపడిన భారతదేశానికి ప్రతీకగా భావిస్తారు.
రెండు సందర్భాలు.. రెండు సందేశాలు
జాతీయ జెండాను ఎగురవేయడం, ఆవిష్కరించడం రెండూ ఒకేలా కనిపించినా.. వాటి వెనుక ఉన్న భావం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆగస్టు 15న జెండా పైకి ఎగరడం.. స్వేచ్ఛా భారతదేశం పుట్టుకకు ప్రతీక. జనవరి 26న ఇప్పటికే పైభాగంలో ఉన్న జెండా ఆవిష్కృతం కావడం.. రాజ్యాంగబద్ధమైన గణతంత్ర భారతదేశ స్థిరత్వానికి ప్రతీక.
చూడటానికి ఇది చిన్న తేడాలా అనిపించినా.. భారతదేశ చరిత్రను అర్థం చేసుకునే క్రమంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకటి స్వాతంత్ర్య ఆవిర్భావాన్నిగుర్తుచేస్తే.. మరొకటి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వాన్ని గుర్తుచేస్తుంది.
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం (హర్ ఘర్ తిరంగా)..
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ఇంటింటా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు.
ఇది కేవలం ఇళ్లపై జెండాను ఎగురవేయడం మాత్రమే కాదు. జాతీయ పతాకాన్ని ప్రతి కుటుంబంతో, ప్రతి పౌరుడితో అనుసంధానించే ప్రయత్నం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకోవడం.. స్వేచ్ఛ విలువను తెలుసుకోవడం.. దేశ ప్రస్థానంలో ప్రతి పౌరుడూ తన వంతు భాగస్వామ్యాన్ని గుర్తించడం ఇందులోని ప్రధాన ఉద్దేశం.
అందుకే ఈ ఆగస్టు 15న మీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు.. అది కేవలం ఓ జెండా కాదని గుర్తుంచుకోండి. ఆ మువ్వన్నెల్లో కోట్లాది భారతీయుల ఆకాంక్షలు ఉన్నాయి.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఉన్నాయి.. దేశ చరిత్ర ఉంది. జెండా రెపరెపలాడుతున్న ప్రతి ఇంటి ముంగిట.. భారత స్వాతంత్ర్య గాథ మరోసారి సజీవమవుతుంది.
