పెసరలో శాస్త్రీయ సాగుతో అధిక దిగుబడులు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : పెసరలో శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ సూచించారు. ఆత్మ ఆధ్వర్యంలో మేదరిపేటలో మూడు ఎకరాల పెసర పంటలో పొలంబడి నిర్వహించి 25 మంది రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సరైన విత్తే సమయం, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, నీటి యాజమాన్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పురుగు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ కృష్ణ మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్ధతులను తమ పొలాల్లో అమలు చేసుకోవడమే పొలంబడి లక్ష్యమన్నారు. పెసర పంట నేల సారాన్ని మెరుగుపరచడంలో ఉపయోగకరమని తెలిపారు. ఆత్మ చైర్మన్ శ్రీ సింగతి మురళి మాట్లాడుతూ.. రైతులు పొలంబడిలో నేర్చుకున్న పద్ధతులను ఆచరణలో పెట్టి సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి కృష్ణ, శ్రీనివాస్, మౌనిక, శ్రీకన్య, శ్రవణ్, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
