ఎల్‌నినో ప్రభావం..
- రైతులకు వరి సాగు వద్దంటూ ఎఈవో వినూత్న పద్ధతిలో అవగాహన..
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో, రైతులు నీటి వినియోగం అధికంగా ఉండే వరి పంట సాగును తగ్గించి, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం నల్లగొండ మండల పరిధిలోని పానగల్లు గ్రామంలో వ్యవసాయ శాఖ ఏఈఓ దేవేందర్ నాట్లు వేస్తున్న రైతు పొలం వద్దకు వెళ్లి, మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ వినూత్నంగా అవగాహన కల్పించారు.
వరి పంటలు వేయవద్దని రైతును వేడుకున్న ఈ దృశ్యం రైతుల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు చూపుతున్న ఆందోళనను, నీటి సంరక్షణపై వారి నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ సందర్భంగా ఎఈవో మాట్లాడుతూ నీటిని కాపాడుకుందామని భవిష్యత్ తరాలకు అందిద్దామని, వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలను ప్రోత్సహిద్దామని, రైతు సంక్షేమమే వ్యవసాయ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు.
