అనారోగ్యంతో జోగినపల్లి శ్రీనివాస్ రావు మృతి

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
కేటీఆర్‌కు మేనమామ
విషాదంలో కేసీఆర్ కుటుంబం..
కార్యక్రమాలు రద్దు చేసుకున్న కేటీఆర్, హరీశ్ రావు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ బావమరిది, కేటీఆర్‌కు మేనమామ అయిన జోగినపల్లి శ్రీనివాస్ రావు గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు, బీఆర్ఎస్ నాయకుల్లో విషాదం అలుముకుంది.

శ్రీనివాస్ రావు మృతి విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని సుచిత్రలోని నివాసానికి తరలించారు. శ్రీనివాస్ రావు కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు, ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కేటీఆర్, హరీశ్ రావు కార్యక్రమాలు రద్దు
మామ శ్రీనివాస్ రావు మృతి విషయం తెలియడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు హైదరాబాద్‌లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సుచిత్రలోని శ్రీనివాస్ రావు నివాసానికి చేరుకున్న కేటీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకుని శ్రీనివాస్ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం.

కేసీఆర్ కుటుంబంలో విషాదం

శ్రీనివాస్ రావు కేసీఆర్ సతీమణి శోభకు సోదరుడు కావడంతో ఆయనకు కేసీఆర్‌తో సన్నిహిత కుటుంబ బంధం ఉంది. కేటీఆర్‌కు ఆయన మేనమామ. శ్రీనివాస్ రావు మృతి నేపథ్యంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు సమాచారం.

శ్రీనివాస్ రావు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా యశోద ఆస్పత్రికి చేరుకుని శ్రీనివాస్ రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.