కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ వెంటనే పునఃప్రారంభించాలి..

  • అర్హులకు వృద్ధాప్య, బీడీ పెన్షన్లు మంజూరు చేయాలి
  • మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి

జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ వెంటనే పునఃప్రారంభించాలని, అర్హులకు వృద్ధాప్య, బీడీ పెన్షన్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు అండగా కేసిఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని 2023 డిసెంబర్ నుండి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. హై కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు నిలిపివేతకు ఆదేశించిందని, వెంటనే ఉత్తర్వులు జారీ చేసి పథకాన్ని కొనసాగించాలని కోరారు.

కేసిఆర్ హయాంలో వృద్ధాప్య పెన్షన్ రూ.200 నుండి రూ.2000కు, వికలాంగులకు రూ.4వేలకు పెంచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు అందరికీ రూ.4000, మహిళలకు రూ.2500 పెన్షన్ ఆగస్టు 15 నుండి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికులకు ప్రొవిడెంట్ ఫండ్ చెల్లించాలన్న హామీని కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి పేదలు, మహిళలు, వృద్ధులకు అన్యాయం చేయవద్దని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాల అమలును సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వానికి ఆడబిడ్డల పట్ల చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలకు తోడుగా కొత్తవి అమలు చేయకున్నా పాతవి అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జీనత్ పర్వీన్ మున్నా, నాయకులు వొళ్లెం మల్లేశం, శీలం ప్రవీణ్, గాజుల రాజేందర్, కల్లెపల్లి దుర్గయ్య, కోరుకంటి రాము, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.