గన్నవరం విమానాశ్రయం నుంచి 2 కొత్త సర్వీసులు ..!

గన్నవరం, ఆగస్టు 13, ఆంధ్రప్రభ : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి ప్రయాణికులకు మరో శుభవార్త. ఇక్కడి నుంచి రెండు కొత్త ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) తో పాటు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరాలకు ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు.

ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ఈ సర్వీసులను నడపనుంది. వారానికి మూడు రోజుల పాటు ఈ విమానాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభం..

ఈ రెండు కొత్త విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం విమానాశ్రయ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.

పెరగనున్న కనెక్టివిటీ..

తాజా సర్వీసుల వల్ల ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులకు, వ్యాపార వేత్తలకు ఎంతో సమయం ఆదా కానుంది. ముఖ్యంగా వారణాసికి నేరుగా విమాన సౌకర్యం కలగడంపై బెజవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.