అక్రమంగా యూరియా నిల్వ చేస్తే చర్యలు తప్పవు

కమాన్‌పూర్, ఆంధ్రప్రభ: అక్రమంగా యూరియాను నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి హెచ్చరించారు. కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కమాన్‌పూర్ మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో యూరియా బస్తాలు అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌ఐలు లక్ష్మణ్, రమేష్, లచ్చన్న, కమాన్‌పూర్ ఎస్‌ఐ కొట్టె ప్రసాద్‌ సంఘటనా స్థలానికి వెళ్లి తనిఖీ చేసినట్లు డీసీపీ తెలిపారు.

అక్కడ 127 యూరియా బస్తాలు నిల్వ చేసినట్లు గుర్తించామని చెప్పారు. మండల ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌ సమాచారంతో యూరియా బస్తాలను పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ బస్తాలను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామం నుంచి తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందన్నారు.

యూరియా బస్తాలను స్వాధీనం చేసుకుని కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ట్రాలీ డ్రైవర్‌ రాజ్‌కుమార్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రాంరెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, గోదావరిఖని టూటౌన్‌ సీఐ నక్క ప్రసాదరావు, మంథని ఏడీఏ అంజని, ఏఈవో నవీన్ తదితరులు పాల్గొన్నారు.