జూడాల సమ్మె ఉధృతం.. అత్యవసర సేవలు మినహా విధుల బహిష్కరణ

30 శాతం స్టైఫండ్‌ పెంపు డిమాండ్‌..

ప్రభుత్వ 3 శాతం ప్రతిపాదనపై అసంతృప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ: స్టైఫండ్‌ పెంపు డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ జూడా), ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్‌ వైద్యుల స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని ఏపీ జూడా డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వం కేవలం 3 శాతం పెంపునకు ప్రతిపాదన చేసినట్లు సంఘం వెల్లడించింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసిన జూడాలు బుధవారం నుంచి రెండో దశ ఆందోళనకు దిగుతున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించనున్నారు. అదే సమయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అయితే ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని ఏపీ జూడా స్పష్టం చేసింది. రోగులకు అత్యవసర వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. స్టైఫండ్‌ పెంపుపై ప్రభుత్వం పునరాలోచించి న్యాయమైన పరిష్కారం చూపాలని జూనియర్‌ వైద్యులు కోరారు.