శ్రీకరం శుభకరం శ్రావణం…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించే శ్రావణమాసం ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానుంది. శివుడు, శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, మంగళగౌరీదేవికి ప్రీతికరమైన ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. సెప్టెంబర్ 11 వరకు కొనసాగనున్న ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములతో పాటు వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన రోజులు ఉండటంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఇక శ్రావణమాసం సందర్భంగా నెల రోజుల పాటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.
ఇక శ్రావణ మాసం ప్రారంభంతోనే శుభకార్యాల సందడి మొదలుకానుంది. ఇన్ని రోజులు వాయితా వేసుకున్న వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరియు ఇతర శుభ సందర్భాలకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రజలు నిమగ్నమవుతున్నారు. పండితుల వివరాల ప్రకారం.. ఈ ఏడాది శ్రావణమాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు పలు అనుకూలమైన రోజులు ఉన్నాయి.
ఆగస్టు నెలలో:
16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలు
సెప్టెంబర్లో:
3, 4, 5, 8, 10 తేదీలు శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే ముహూర్తాలు ప్రాంతం, పంచాంగం, తిథి, నక్షత్రాల ఆధారంగా మారే అవకాశం ఉండటంతో పురోహితుల సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
పండుగలు.. వ్రతాల సందడి
శ్రావణమాసంలో పలు ముఖ్యమైన పండుగలు, వ్రతాలు జరగనున్నాయి.
ఆగస్టు 13: శ్రావణమాస ప్రారంభం
ఆగస్టు 17: నాగుల పంచమి
ఆగస్టు 17, 24, 31, సెప్టెంబర్ 7: శ్రావణ సోమవారాలు
ఆగస్టు 18, 25, సెప్టెంబర్ 1, 8: మంగళగౌరీ వ్రతాలు
ఆగస్టు 28: వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి)
సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి
సెప్టెంబర్ 11: శ్రావణ అమావాస్య (పోలాల అమావాస్య)
ప్రతి సోమవారం శివారాధనలు, ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాలు, ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ పూజలు నిర్వహించేందుకు మహిళలు, భక్తులు సిద్ధమవుతున్నారు.
వ్యాపారాలకు ఊతం
శ్రావణమాసంలో శుభకార్యాలు పెరగడంతో వివాహ సంబంధిత వ్యాపారాలకు కూడా ఊపు రానుంది. వస్త్ర దుకాణాలు, బంగారు నగల వ్యాపారులు, పూల వ్యాపారులు, డెకరేషన్, షామియానా, లైటింగ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్స్, టైలర్లు, వాయిద్య కళాకారులు, పురోహితులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మంచి ముహూర్తాలు కొన్ని తేదీల్లోనే ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాలు, వరుసగా శుభ ముహూర్తాలు ఉన్న రోజులకు ముందస్తు బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
భక్తి, నియమనిష్ఠలకు ప్రతీక
శ్రావణమాసంలో భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉంటారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, లక్ష్మీదేవి ఆలయాల్లో కుంకుమార్చనలు, గ్రామ దేవాలయాల్లో భజనలు, హరికథలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన, నదీస్నానాలు, అన్నదానాలు, గోపూజలు చేస్తూ భక్తులు ఈ మాసాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలతో పాటు మార్కెట్లోనూ సందడి పెరగనుంది. దీంతో వ్యాపార వర్గాలు, శుభకార్యాల నిర్వాహకులు ఈ మాసంపై ఆశలు పెట్టుకున్నారు.
